కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే భారత్, పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు.
ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అగ్రరాజ్యం అమెరికా.. నిజంగా ఆ పాత్ర పోషిస్తే అందరికీ సంతోషమే. కానీ తనకు అవసరమైన విషయాల్లో కాక.. అవసరం లేని విషయాల్లోనూ అమెరికా తలదూర్చి ఆ తరువాత వాసన చూసి.. చేతులు కాల్చుకుంటూ ఉంటుంది. ఇది ఆ దేశానికి కొత్తేమీ కాదు. తాజాగా కాశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పమవ్వగా.. అమెరికా ఆ వ్యాఖ్యలపై నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. భారత్‌తో తమకున్న సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయోనన్న నేపథ్యంలో అమెరికా.. ట్రంప్ వ్యాఖ్యలకు దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది.
కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం అవసరమైతే భారత్, పాక్‌ల నడుమ మధ్యవర్తిత్వం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో అమెరికాలో నిన్న సమావేశమైన ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే కాశ్మీర్ సమస్యపై తాను భారత ప్రదాని మోదీతో చర్చించానని కూడా ట్రంప్ అన్నారు. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
కాశ్మీర్ సమస్యపై మోదీ ఎన్నడూ ట్రంప్‌తో చర్చించలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ అన్నారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని భారత్ తేల్చి చెప్పింది. ఇక ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన కాంగ్రెస్ సభ్యులే తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు గాను తాము భారత్‌కు క్షమాపణ చెబుతున్నామని, ట్రంప్‌వి అర్థం లేని వ్యాఖ్యలని, ఆయన పూర్తిగా రాజకీయ అపరిపక్వతతో మాట్లాడుతున్నారని వారన్నారు. దీంతో ట్రంప్ కాశ్మీర్ సమస్యపై చేసిన వ్యాఖ్యలకు గాను అమెరికా కొంత వెనక్కి తగ్గినట్లు మనకు స్పష్టమవుతోంది..!