తనకు అడ్డు వచ్చిన వారిని, లేదా తనను ఇబ్బంది పెట్టిన వారిని చంపడం అనేది అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య. తనను ఇబ్బంది పెట్టే ఎంతటి వారిని అయినా సరే ఆ దేశం క్షమించే పరిస్థితి ఉండదు. ప్రధానంగా తాను పెంచి పోషించిన ఉగ్రవాదులను చంపడంలో అమెరికా స్టైల్ వేరు. ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబుబాకర్ అల్ బాగ్దాధీని అమెరికా అలాగే హతమార్చి ప్రపంచానికి కొత్త నీతులు చెప్పింది.
ఇక ఇరాన్ టాప్ కమాండర్ గా ఉన్న ఖాసీం సులైమానీని అమెరికా హతమార్చింది. తమకు ఇబ్బందిగా మారాడు అనే కారణంతో అమెరికా ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే జాబితాలో మరొకరిని లేపేసింది అమెరికా. అల్-ఖైదా అరేబియా ద్వీపకల్ప విభాగానికి నాయకత్వం వహిస్తున్న ఖాసీం రైమీ అనే ఉగ్రవాదిని చంపింది. అతను 1990 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.
అమెరికాను టార్గెట్ చేసి ఆ దేశ సైనిక స్థావరాలు, దౌత్యకార్యాలయాలపై భారీ దాడులకు ప్లాన్ చేసాడు. అమెరికా కీలక అధికారిని చంపింది. 2006లో జైలు శిక్ష నుంచి తప్పించుకున్న అతను… 2008లో సనాలో అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేసాడు. 2009లో ‘అండర్‌వేర్ బాంబర్’ ఘటనలో ఇతడు నిందితుడుగా ఉన్నాడు. 2015లో అల్‌ఖైదా యెమెన్ విభాగానికి నాయకుడిగా ఎదిగాడు.
ఇతని సమాచారం అందజేస్తే 10 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని అమెరికా ఒక ప్రకటన కూడా చేసింది. ఈ నేపధ్యంలోనే రెండేళ్ళ నుంచి అతని కోసం తీవ్రంగా గాలిస్తున్న అమెరికా బలగాలు అతన్ని డ్రోన్ సాయంతో ఇటీవల హతమార్చాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇక త్వరలోనే అమెరికా మరొకరిని లేపేసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది.