కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ కలిసి మజ్లిస్‌ను అడ్డుకోగలవా? : అమిత్ షా

-

అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్‌ పార్టీ యత్నిస్తోందని అమిత్ షా అన్నారు. మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం జరుగుతోందని తెలిపారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. మోదీ ఏది చెబుతారో అది తప్పకుండా చేస్తారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో పర్యటించిన అమిత్ షా బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు.

“కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. రాజస్థాన్‌, తెలంగాణ ప్రజలకు కశ్మీర్‌తో ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. కశ్మీర్‌ కోసం భువనగిరి వాసులు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. ఆర్టికల్‌ 370 రద్దు చేసి కశ్మీర్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశారు. మోదీ.. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని పరిసమాప్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని సురక్షితంగా ఉంచారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ కలిసి మజ్లిస్‌ను అడ్డుకోగలవా?” అని అమిత్ షా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news