తెలంగాణలో నేడు,రేపు తేలికపాటి వర్షాలు

-

తెలంగాణలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఆదివారం వరంగల్‌ జిల్లాలో వర్షాలు కురిశాయని పేర్కొంది. ఇక్కడి నల్లబెల్లి మండలం మేడపల్లిలో 10.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

నర్సంపేట మండలం లక్నేపల్లిలో 5.2, సంగారెడ్డి జిల్లా అందోలు మండలం అన్నాసాగర్‌లో 4.7, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6, ములుగు జిల్లా కాశిందేవ్‌పేటలో 4.3, మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెం.మీ. వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షాలు నమోదయ్యాయని వివరించారు.

మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆదివారం రోజున దేశంలోని నికోబార్‌ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఇవి ఈ నెల 31వ తేదీ వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు..

Read more RELATED
Recommended to you

Latest news