అంతరిక్షంలో మరో తెలుగుతేజం వికసించింది. భారతదేశం నుంచి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా తెలుగు తేజం గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. ఆదివారం రోజున గోపి.. దిగ్విజయంగా రోదసియాత్ర పూర్తి చేశారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపు సాధించారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూషెపర్డ్-25 (ఎన్‌ఎస్-25) వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర చేశారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివారులోని ‘ప్రిజర్వ్ లైఫ్’ సంస్థకు సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
భారత్‌కు చెందిన రాకేశ్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదసి యాత్రలు చేసినప్పటికీ వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ ఆయనకు భారత పాస్‌పోర్టు ఉంది. అందువల్ల రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా ఆయన గుర్తింపు సాధించారు.
తాజా యాత్రలో గోపీచంద్‌తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, ఫ్రాన్స్ పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహస యాత్రికురాలు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ పాల్గొన్నారు.