భారతీయ సినిమా ఖ్యాతిని ఎన్నో అత్యున్నత శిఖరాలకు చేర్చి ముందుకు తీసుకెళ్ళిన వారిలో బాలీవుడ్ మెగాస్టార్ గా పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ఒకరు అనే చెప్పాలి. 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతంలో జన్మించిన అమితాబ్, మొదటినుంచి అన్ని విషయాల్లోనూ ఎన్నో ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. ఆయన తల్లి తేజీ బచ్చన్ ఒక సోషల్ యాక్టివిస్ట్, ఇక ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ నవలా రచయిత. తన బాల్యాన్ని ప్రతాపగఢ్ లో గడిపిన అమితాబ్, పెరిగి పెద్దయి ఉన్నత విద్యను అభ్యసించిన తరువాత తన తల్లి ప్రోత్సాహంతో థియేటర్ ఆర్ట్స్ లో కొంత ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత తొలిసారి సాత్ హిందుస్తానీ అనే సినిమా ద్వారా 1969లో బాలీవుడ్ సినిమా రంగ ప్రవేశం చేశారు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమితాబ్, ఆ తర్వాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు.
ఇక ఆయన కెరీర్లో జంజీర్, షోలే, దీవార్, డాన్, త్రిశూల్, ముఖద్దర్ కా సికందర్, అమర్ అక్బర్ ఆంటోనీ, లావారీస్, పా తదితర గొప్ప సినిమాలు ఎన్నో ఉన్నాయి. కెరీర్ పరంగా ఇప్పటివరకు 200కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా సుస్థిర స్థానాన్ని ఆయన సంపాదించారు. అవార్డుల పరంగా పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, మరియు దాదాసాహెబ్ ఫాల్కే వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలను అమితాబ్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 77 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా ఎంతో చలాకీగా నటిస్తూ ఉంటారని, ఆయనతో కలిసి పని చేసిన పలువురు సినిమా ప్రముఖులు చెప్తుంటారు. ఇక నేడు ఆయన నటించిన తొలి సినిమా సాథ్ హిందుస్తానీ దిగ్విజయంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఆయన ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు సహా ఎందరో సినిమా ప్రముఖులు అమితాబ్ కు వెల్లువలా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక నేడు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బాలీవుడ్ సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తన తండ్రికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘ఒక కొడుకుగా కంటే ఒక నటుడికి అభిమానిగా ఆయన నేను ఎంతో ఇష్టపడతాను, ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించి మమ్మల్ని అలరించిన మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, మీ ప్రేమాభిమానాలు మాతో ఎప్పుడూ ఉండాలని’ కోరుకుంటున్నట్లు అభిషేక్ తన పోస్టులో తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది