తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా ఆస్తి,పంట నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ముంపు గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా నష్టపరిహారం అందిస్తోంది.ఈ క్రమంలోనే సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం పలుసంస్థల ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించడంతో పాటు చెక్కులు అందజేశారు. ఏఏంఆర్ ఇండియా కంపెనీ సీఎంఆర్‌ఎఫ్ కు రూ.ఒక కోటి విరాళం ప్రకటించగా.. కంపెనీ ఎండీ ఎ.మహేశ్ కుమార్ రెడ్డి సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. వోక్స్‌సెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కె.ప్రవీణ్ పూల సీఎంకు రూ.50లక్షల చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ఫండ్స్ ఇచ్చిన వారిని సీఎం రేవంత్ అభినందించారు.