సామాన్య ప్రజలకు మరో షాక్. అమూల్, మదర్ డైరీ పాల ధరలు మళ్లీ పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను అమ్ముతున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ గోల్డ్, బర్రెపాల ధరను లీటర్ కు రూ. 2 చొప్పున పెంచినట్టు శనివారం ప్రకటించింది. ఫ్యాట్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని ప్రాంతాల్లో పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జిసిఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథి వెల్లడించారు. మరోవైపు మదర్ డైరీ సైతం తమ పాల ధరను పెంచింది. ఢిల్లీ-ఎన్ సిఆర్ పరిధిలో ఫుల్ క్రీం పాలతో పాటు ఆవుపాల ధరను లీటర్ కు రూ. 2 చొప్పున పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ప్రస్తుతం లీటర్ కు రూ.61 గా ఉన్న ఫుల్ క్రీం పాల ధర ఇకపై రూ.63 కు, ఆవుపాల ధర రూ. 53 నుంచి రూ. 55 కు పెరుగుతుంది.