భక్తుల పాలిట కొంగు బంగారమైన అనంతపురం గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర కొనసాగుతోంది. చాగలగుట్టపల్లిలోని పుట్టింటి నుంచి భారీ ఊరేగింపుతో గంగమ్మ తల్లి జాతరకు చేర్చారు. అడుగడుగునా అమ్మవారికి బోనాలు, మంగళహారతులు పట్టి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం కోసం అమ్మవారి ఆలయం ఎదుట మహిళలు వరపడ్డారు. సంతానం ప్రసాదించమని గంగమ్మతల్లిని వేడుకున్నారు. తమ కష్టాలను తొలగించి సుఖశాంతులు ప్రసాదించమని కోరుతూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతోంది. జాతర వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఒక డీఎస్పీ, 24 మంది ఎస్ఐలు, 7 మంది సీఐలు, 300 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాయలసీమ లోని వివిధ ప్రాంతాల నుంచి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. జాతర ఇవాళ, రేపు జరుగనున్నది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.