ఏపీ రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం విధితమే. ఈ తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధానంగా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు మన పెద్దలు. అయితే వైసీపీ అభ్యర్థికి ఇంట్లోనే ప్రత్యర్థులు తయారు కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో భర్త పైనే భార్య బరిలోకి దిగనుండటం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆసక్తికర పరిణామం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు అండగా నిలవాల్సిన ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయనకు మద్దతు ఇవ్వకపోగా.. ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. తాను ఈనెల 22న నామినేషన్ వేయనున్నట్టు ఆమె పుట్టిన రోజు సందర్భంగా చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం జడ్పీటీసీ సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్ధరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి వీరు వేర్వేరుగా ఉంటున్నారు.