టీడీపీలో ఆ కుటుంబానికే ప్రాధాన్యమా… ఎందుకలా…?

-

తెలుగుదేశం పార్టీ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. ఆ తర్వాత ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలకు చెందిన నలుగురు అభ్యర్థులు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేశ్‌, హిందూపురం నుంచి నందమూరు బాలకృష్ణ పోటీ చేస్తుండగా… విశాఖ లోక్‌సభ స్థానానికి బాలకృష్ణ చిన్నల్లుడు ఎం.భరత్‌ పోటీ చేస్తున్నారు. అయితే… ఈ నందమూరి, నారా కుటుంబాల కంటే… ఇప్పుడు ఆయన పేరే మారుమోగుతోంది. ఇంకా చెప్పాలంటే… ఆయన చెబితే చాలు… ఏ పనైనా సరే పార్టీలో అయిపోతుంది.

ఇప్పటికే ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన ఆయన కుటుంబానికి ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఓ ఎంపీతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాలను చంద్రబాబు కేటాయించారు. ఆయనేవరో కాదు… మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు… తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుంచి 1983 నుంచి వరుసగా విజయం సాధించిన యనమల… 2009 ఎన్నికల్లో తొలిసారి ఓడారు. నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక మార్గంలో చట్ట సభలోనే కొనసాగుతున్నారు యనమల. 1995లో చంద్రబాబుకు అండగా ఉన్నారనే కారణంతో.. స్పీకర్‌ పదవి వరించింది. ఆ తర్వాత 1999 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. 2014లో కూడా ఎమ్మెల్సీ కోటాలోనే మంత్రి పదవి నిర్వహించారు యనమల. పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న యనమల.. సొంత నియోజకవర్గంలో మాత్రం గెలవలేకపోతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు పోటీ చేసి ఓడారు. దీంతో… ఈసారి ఆయన స్థానంలో రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తున్నారు.

అదే సమయంలో… యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మరోసారి మైదుకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అటు యనమల సమీప బంధువు పల్లా శ్రీనివాసయాదవ్‌ గాజువాక నుంచి అసెంబ్లీ టికెట్‌ దక్కించుకున్నారు. వీరితో పాటు ఈసారి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు పుట్టా మహేశ్‌ యాదవ్‌ రాబోయే ఎన్నికల్లో ఏలూరు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. తన కుమార్తెతో పాటు వియ్యంకుడు, అల్లుడు, తమ్ముడికి కూడా టికెట్లు ఇప్పించుకోవడంలో యనమల కీలక పాత్ర పోషించాడు. తాను గెలవకపోయినప్పటికీ… ఇలా తన వారికే టికెట్లు తెప్పించుకోగలుగుతున్నారు. ఇదే విషయంపై ఇప్పుడు పార్టీలో కొందరు సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా తాము పార్టీలో ఉన్నప్పటికీ… తమకు ఎలాంటి అవకాశం రావడం లేదని… అదే సమయంలో వరుసగా ఓడిపోతున్న వారికి మాత్రం మళ్లీ మళ్లీ అవకాశం ఇస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news