వైసీపీ మేనిఫెస్టోను తాజాగా సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని తెలిపారు సీఎం జగన్. ఇచ్చిన హామీలు అమలు చేసి.. ప్రజల్లోకి వెళ్లి మళ్లీ ఓట్లు అడుగుతున్నాం. కానీ గత ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. ఈ 58 నెలల్లోనే ఈ మేనిఫెస్టోకి గౌరవం వచ్చిందని తెలిపారు. వారికి మాకు ఉన్న తేడాను ఒకసారి గమనించండి అని కోరారు.
మేనిఫెస్టో అన్నది పవిత్ర గ్రంథం.. చెప్పిన మాటలు, వాగ్దానాలు మేనిఫెస్టోలో చెప్పినవి చేయకపోతే పేదల బ్రతుకులు చిన్నాభిన్నం అవుతాయి అనేది ఉదాహరణ అన్నారు. 2014లో నాకు బాగా గుర్తుకు ఉంది.. ఆనాడు కూడా చేయగలిగిందే మేము చెప్పాం. మోసపూరిత హామీలతో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని వెల్లడించారు. చరిత్రలో చరిత్ర హీనుడుగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించండి అన్నారు.