ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది.. కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంగా గీతను బరిలో ఉంచుతుంది. ఓవైపు జనసేన.. మరోవైపు వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి. ఇక, ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి..? సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పవన్ కల్యాణ్ ని ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలని సూచించారు. గ్రామస్థాయి మీటింగ్ లు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు, ఇప్పటికీ రాజకీయాలు చాలా మారాయని తెలిపారు. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారని అంటున్నారు ముద్రగడ. ఈ ఎన్నికలు మీ ఎన్నికలని కసిగా పని చేయాలన్నారు. “వైసీపీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను.. మీ పని మీరు చేయండి” అంటూ పిలుపునిచ్చారు.