ఏపీలో ఎన్నికల ఫలితాల వెల్లడికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ మొదలైన నాలుగు గంటల్లో తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వ్యక్తులు ఉండకూడదని షరీఫ్ స్పష్టం చేశారు. 4వ తేదీ కడపలో ఆర్టీసి బస్సులను తిరగనివ్వమని వెల్లడించారు. కడప నగరం నాలుగు సరిహద్దు ప్రాంతాల్లోనే బస్సులు నిలిపివేస్తామని.. ప్రయాణికులు 8 కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సులు ఎక్కాల్సిందేనని చెప్పారు. ఈసీ నిబంధనల మేరకే కడప నగరంలోకి బస్సులు తిప్పట్లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్న డీఎస్పీ.. జూన్ 3వ తేదీ నుంచి పార్టీ కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.