విజయనగరం జిల్లాలో రూ. 4, 592 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కు నేడు శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్ట్, ఫిష్ లాండింగ్ సెంటర్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మూడేళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అవుతుందని.. 2026 లో ఇక్కడినుండే విమానాలు ఎగురుతాయని తెలిపారు సీఎం జగన్.
భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసల ప్రాంతమని.. రానున్న రోజుల్లో ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు సీఎం జగన్. ఉత్తరాంధ్రను బాగు చేయాలని మనసా, వాచా, కర్మణా తమ సర్కార్ పనిచేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేలా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. ఇక విశాఖ అందరికీ ఆమోదయోగ్యమైన నగరం అని.. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెట్టబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.