స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో టిడిపి నేతలు వైసిపిపై చేస్తున్న విమర్శల పట్ల స్పందించారు మంత్రి సీదిరి అప్పలరాజు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టును రాజకీయ కుట్రగా ప్రజలలోకి తీసుకు వెళుతున్నారని మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ యువకులకు సంబంధించిందని.. ఎవరికి ట్రైనింగ్ ఇవ్వకుండా, ఇనిస్ట్యూట్ కట్టకుండా డబ్బులు కొల్లగొట్టారని అన్నారు.
అవినీతి చేసిన వారు ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని అన్నారు మంత్రి అప్పలరాజు. చంద్రబాబు అరెస్ట్ తో తనయుడు లోకేష్ కంటే దత్తపుత్రుడి ఓవరాక్షన్ ఎక్కువైందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో కూడా అంత ఓవర్ యాక్షన్ చేయలేదన్నారు. వ్యవస్థలోని లొసుగులను ఉపయోగించుకొని చంద్రబాబు డబ్బును ఖాతాలో వేసుకున్నాడని ఆరోపించారు.
14 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు నేర్చుకున్న రాజనీతి ఇదేనా..? బాబు అని ప్రశ్నించారు. చంద్రబాబు లాయరే ఆయన తప్పు చేయలేదని చెప్పలేదని.. ప్రొసీజర్ పాటించలేదన్నారని వివరించారు మంత్రి అప్పలరాజు. అరెస్టు కావడంతో సింపతి కోసం చంద్రబాబు చాలా ట్రై చేశాడని.. కానీ సాధారణ ప్రజలు ఒక్కరంటే ఒక్కరు కూడా సానుభూతి చూపించలేదన్నారు.