పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

-

ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రోజున సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు దీనికి సంబంధించిన ఫైల్‌పై మూడో సంతకం చేశారు. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను ఒకేసారి రూ.4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం పింఛను పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్‌ భరోసా’ పేరునే ఇప్పుడు కూడా కొనసాగించనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పుకళాకారులు, హిజ్రాలు, హెచ్‌ఐవీ బాధితులు, కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న రూ.3 వేల పింఛన్‌ను పెంచి రూ.4 వేలు అందజేయనున్నారు. వీరికి ఏప్రిల్‌ నుంచే పెంపును అమలు చేయనున్నారు. జులై 1న పింఛను కింద వీరికి రూ.7 వేలు (జులై 1న ఇచ్చే రూ.4 వేలు, ఏప్రిల్‌ నుంచి మూడు నెలలకు రూ.వెయ్యి చొప్పున కలిపి) అందిస్తారు. దివ్యాంగులకు ప్రస్తుతం వారికి అందుతున్న రూ.3 వేలను ఒకేసారి రూ.6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛను రూ.15 వేలకు పెంచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news