టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్, బేబీ ఫేం వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్. అరుణ్ భీమవరపు తెరకెక్కించిన ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడీ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ స్టోరీ : అర్జున్ (ఆశిష్)కు దేవుడు, దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా దెయ్యాలున్నాయని తెలిస్తే చాలు అక్కడికి వెళ్లి.. అవి లేవని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తుంటాడు. ఆ వీడియోలన్నింటినీ తన యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టి డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ విషయంలో అతనికి తన సోదరుడు ప్రతాప్ (రవికృష్ణ) కూడా సహాయ పడుతుంటాడు. ఓసారి అర్జున్‌కు ప్రతాప్ ప్రియురాలు ప్రియ (వైష్ణవి చైతన్య) ద్వారా దివ్యవతి అనే దెయ్యం గురించి తెలుస్తుంది. ఎలాగైనా ఆ దెయ్యాన్ని తన ప్రేమలో పడేయాలని నిర్ణయించుకుని అర్జున్ అక్కడికి వెళ్తాడు. మరి ఆ తర్వాత తనెలాంటి పరిణామాల్ని ఎదుర్కొన్నాడు? దివ్యవతి కథేంటి? అసలు దివ్యవతి కథను అర్జున్ దగ్గరకు ప్రియ ఎందుకు చేర్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!