ఎన్నికలకు ముందు తీవ్ర చర్చనీయాంశం అయిన.. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ బుట్ట దాఖలైంది. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ.. ఏపీ అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 మధ్య అప్పటి జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా రద్దయిపోయింది. ఎన్నికలకు మూడు వారాల ముందు.. అనూహ్యంగా ఈ అంశం తెర మీదకు వచ్చింది. అప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే. ఈ చట్టం వ్యవహారం తెరమీదికి వచ్చిన తర్వాత.. జరిగిన ఎన్నికల ప్రచారం మరో ఎత్తు.
అప్పటి వరకు గెలుపు ధీమాతో ఉన్న వైసీపీ నాయకులను ఈ చట్టంపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం.. దిమ్మతిరిగిపోయేలా చేసింది. ‘టైటిల్ చట్టం అమలు చేస్తే.. మీ భూములు మీవి కావు. జగన్ వాటిని లాగేసుకుంటాడు. మీ ఆస్తులు తీసేసుకుంటాడు. మీ భూములు లాగేసుకుంటాడు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊరూరా ప్రచారం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టుగానే రెండో సంతకాన్ని ఈ చట్టం రద్దు ఫైల్ పైనే చేశారు. తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం విశేషం.