అప్పులు చేస్తే చెల్లించే శక్తి ఏపీకి లేదు అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ సచివాలయంలో ఆయన 2022-23కి సంబంధించిన నీతి అయోగ్ నివేదిక పై మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని మరోసారి విమర్శించారు.అప్పులు చేసి పనులు చేస్తే.. ఇబ్బందులు తప్పవన్నారు. అభివృద్ధి చేస్తే.. సంపద పెరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే ప్రజలే బాధపడుతారని పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు.
నాయకుల అసమర్థత వలన సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, రాష్ట్ర ఆర్థికస్థితి కుంటుపడుతుందని అభిప్రాయ పడ్డారు. తద్వారా అభివృద్ధికి నిధులు లేక, అప్పుల పాలయ్యి, ఆ భారం ప్రజలపై మోపాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి నాయకులు ముందుచూపుతో ఆలోచిస్తేనే ఆర్థికంగా బాగుపడతామని ఆయన తెలియజేశారు. రాష్ట్రాలు బాగుంటేనే.. దేశం ఆర్థికంగా ఎదుగుతుందని, ఆ దిశగా నాయకులు, అధికారులు కష్టపడి పనిచేయాలని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో వైసీపీ ఆర్థిక విధ్వంసం సృష్టించిందని, ప్రభుత్వ కార్యాలయాలను సైతం
తాకట్టు పెట్టిందని మండిపడ్డారు.