చీరాల దళిత యువకుడు కేస్ లో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాస్క్ లేదని చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ ను ఎస్ ఐ కొట్టడం తో మరణించిన కేసు ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. కిరణ్ కుమార్ తరపున మాజీ ఎం పి హర్షకుమార్ పిటిషన్ వేసిన సంగతి తెలుసిందే. ఇక బాధితుడి తరపున హైకోర్టు న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఈ కేస్ ను సీబీఐ కి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
విచారణ పట్ల కిరణ్ కుమార్ తల్లిదండ్రులు సంతృప్తి చెందారని కేస్ కొట్టేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. మీ ప్రభుత్వంలో ఎవరినైనా మీరు సంతృప్తి పరచగలరంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ తో పాటు ఉన్న సహ నిందితుడి ఫోన్ కాల్ రికార్డ్ ఇస్తామని న్యాయవాది శ్రవణ్ పేర్కొనగా అవసరం లేదన్న హైకోర్టు, ఈ కేస్ లో స్వాతంత్ర సంస్థ సీబీఐతో ఎంక్వైరీ చేయించే అర్హత కలిగివుందని పేర్కొంది. అయితే ప్రభుత్వం తరపు పూర్తి వివరాలు అందించేందుకు 2 వారాలు సమయం కోరడంతో హైకోర్టు అందుకు అంగీకరించింది.