ఏపీ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశ పరీక్షపై విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఉన్న 164 మోడల్ స్కూల్స్ లో నిర్వహించనున్న ఆరో తరగతి ఎంట్రెన్స్ టెస్టు తేదీలో మార్పు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఏప్రిల్ 20వ తేదీన (ఆదివారం) జరగాల్సి ఉంది.
అయితే ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో ఈ పరీక్ష తేదీని మార్చినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కొత్త తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 21వ తేదీ (సోమవారం)కి ఈ పరీక్షను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు. అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయో.. అక్కడే ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే పరీక్షకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు సూచించారు.