తెలంగాణాలానే ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అది కాక కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా లంక గ్రామాలు అన్నీ నీట మునిగాయి. చాలా చోట్ల పంట నష్టపోయారు. ఇక తాజాగా వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వారం పైగా వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కృష్ణా, గుంటూర్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు కొద్ది సేపటి క్రితమే ఆదేశాలు అందాయి. ఒక్కోక కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామ్ ఆయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఇవ్వాలని ఆదేషాలు జారీ అయ్యాయి. వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే వరదల వలన ఇబ్బందులు పడుతున్న ఒక్కో కుటుంబానికి 500 చొప్పున పంపిణీ చేయాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం మీద పలువురు విమర్శలు చేస్తున్నారు.