ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి జీతాలను పెంచుతూ కీలక ప్రకటన చేసింది జగన్ సర్కార్. ఈ తరుణంలోనే.. తమ జీతాలను ఏకంగా 23 శాతం పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వెలిబుచ్చారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి మంత్రి విడదల రజిని గారిని కలిశారు. గుంటూరులోని ఐబీలో శుక్రవారం మంత్రి గారిని కలిసి సత్కరించారు. జీతాల పెంపునకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.
23 శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల తమ కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆనందం వ్యక్తంచేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్టులో పని చేస్తున్న ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరిస్తే.. మరింత మేలు చేసిన వారు అవుతారని వారు మంత్రిని కోరారు. మంత్రి గారు మాట్లాడుతూ ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న ప్రభుత్వం తమది అని చెప్పారు. క్రమబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.అశోక్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విజయ్‌భాస్కర్, ట్రెజరర్ సి.శివశంకర్, సభ్యులు సీవీ ప్రసాద్ తదితరులతోపాటు, ఆరోగ్యశ్రీ ఉద్యోగులు పాల్గొన్నారు.