ఎన్నికలు సమీపంలో లేవు కదా!అయినా వైసీపీ ఎందుకు పవన్ ను వివాదాల్లోకి నెడుతోంది.అసలు అవసరం ఉన్నా,లేకున్నా తారక్ ప్రస్తావన ఎందుకు తెస్తోంది.అంటే బన్నీ వేరు, పవన్ వేరు, తారక్ వేరు, బాలయ్య వేరు అని వర్గీకరణలు తీసుకువచ్చి కుటుంబాల మధ్య చిచ్చు ఎందుకు రగిలిస్తోంది.ఇంతకూ రోజాను ఎవ్వరయినా వైసీపీలో పట్టించుకుంటున్నారా? ఆమె చెప్పినా సరే నగరి నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తున్నారా? అయినా కూడా ఆమె ఎందుకని పవన్ ను టార్గెట్ చేస్తున్నారు?
ఈ ప్రశ్నలు అన్నీ జనసేన తరఫున వస్తున్నాయి.వాళ్లే సంధిస్తున్నారు సంబంధిత అస్త్రాలను! అయినా వీటిపై మాట్లాడమంటే మాత్రం వైసీపీ మాట్లాడకుండా పవన్ ను మాత్రం వ్యక్తిగతంగా స్థాయి విడిచి లేదా మరిచి విమర్శిస్తోందని జనసేన అంతర్మథనం చెందుతోంది.తాజాగా రాజుకుంటున్న వివాదంలో విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే భాగం అయ్యారు. ఆ వివరం ఈ కథనంలో!
వైసీపీ ఎమ్మెల్యేలు తరుచూ వివాదాలకు తావిచ్చేలానే ప్రవర్తిస్తున్నారు.కేవలం పవన్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. రీమేక్ సినిమాను తక్కువ చేస్తూ, తమని తాము గొప్పవాళ్లుగా కీర్తించుకుంటూ మళ్లీ మళ్లీ వివాదాలు రేపుతున్నారు.ఇదే సమయంలో వైఎస్.జగన్ ను స్థాయికి మించి పొగుడుతూ స్వామి భక్తి మాత్రం పుష్కలంగా చాటుకుంటున్నారు.అంతేకాదు కోరి కయ్యం తెచ్చుకుని పవన్ వర్గంతో విభేదాలు పెంచుకుని పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు.
అంటే ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు? జగన్ ప్రమేయం లేకుండానే ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తున్నారా? అని పవన్ అభిమానులు విస్తుబోతున్నారు.
భీమ్లా నాయక్ సినిమాపై మళ్లీ వివాదం రేగింది.ఈ సారి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తన స్వామి భక్తిని చాటుకుని కొత్త వివాదంలో నిలబడ్డారు అని జనసేన ఆగ్రహావేశం వ్యక్తం చేస్తోంది.ఒక రీమేక్ సినిమాకు తండ్రీ కొడుకులు ఇద్దరూ డబ్బా కొడుతున్నారని పేర్కొంటూ, చంద్రబాబు,లోకేశ్ లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.ఇదివరకు బాలయ్య, తారక్ సినిమాలకు ఇవ్వని రేటింగ్ పవన్ సినిమాకు ఎందుకు ఇస్తున్నారని అన్నారు.దీంతో ఈ వ్యాఖ్యలు అటు పవన్ అభిమానుల్లోనూ ఇటు టీడీపీ అభిమానుల్లోనూ పెను సంచలనంగా మారాయి.