వైఎస్ఆర్సిపి ముఖ్య నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైయస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి గురువారం అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డికి పంపించారు.
ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పై టిడిపి నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ సానుభూతి కూటమి ప్రభుత్వానికి అవసరం లేదన్నారు. అవంతి శ్రీనివాస్ కి రాజకీయ జన్మను ఇచ్చిన చిరంజీవి కుటుంబానికి ఆయన ద్రోహం చేశాడని.. ఆయనని ఢిల్లీలో కూర్చుండబెట్టిన సీఎం చంద్రబాబును అవమానించారని మండిపడ్డారు. ప్రజలను దోచేసిన జగన్ భాగస్వామి అవంతి శ్రీనివాస్ అని ట్వీట్ చేశారు.
కాగా అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అయితే 2014 ఎన్నికలలో టిడిపి గూటికి చేరి అనకాపల్లి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అవంతి.. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ జగన్ కేబినెట్ లో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జగన్ కేబినెట్ నుండి ఆయనని పక్కన పెట్టారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో అవంతి శ్రీనివాస్ భీమిలిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం వైసీపీకి గుడ్ బై చెప్పారు అవంతి.