ముగిసిన కేబినెట్ భేటీ.. 21 అంశాలకు మంత్రి మండలి ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 21 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. వచ్చే మూడు నెలలు జనం లోకి వెళ్లే పథకాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలక బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు. ఇక, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంలోనే తల్లికి వందనం.. ఏప్రిల్ లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని చెప్పుకొచ్చారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవకు సంబంధించిన విధి విధానాలు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఇస్తారు అనే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

అలాగే, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవ తో క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యం (ఫైన్ రైస్) తో మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యాలని పేర్కొన్నారు. దీంతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై కూడా మంత్రి వర్గంలో ఆసక్తికర చర్చ జరిగింది. మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి క్యాబినెట్ లో మంత్రి లోకేశ్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్ట పడి తినే విధంగా మెనూలో మార్పులు చేసినట్లు కేబినెట్ లో తీర్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news