తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ కోరలు చాస్తోంది. ఆ ప్రాంతాన్ని క్యాన్సర్ మహమ్మారి గతకొంతకాలంగా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ గ్రామంలో క్యాన్సర్ నిర్ధరణ పరీక్షలు జరుగుతున్నాయి. జీఎస్‌ఎల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందం ఈ పరీక్షలు చేస్తోంది. విశాఖ హోమి బాబా క్యాన్సర్ పరిశోధన కేంద్రం నుంచి అంకాలజీ వైద్య నిపుణులు ఇక్కడి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అంకాలజీ వైద్య నిపుణులు ఈ ప్రాంతంలో ఇప్పటికే 26 తాగునీటి నమూనాలను అధికారులు సేకరించారు. ఈ ప్రాంతంలో రెండేళ్లుగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోంది. 14 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి వీధిలో క్యాన్సర్ వ్యాధి బాధితులే కనిపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ క్యాన్సర్ రోగులు ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇవాళ ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది.