మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు. ఈనెల 24న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్‌రెడ్డికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కడప లేదా హైదరాబాద్ ఎక్కడికి వస్తారో చెప్పాలని పేర్కొంది.
ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గతనెలలో సీబీఐ ముందు హాజరయ్యారు. ఆయన కాల్ డేటా నుంచి హత్య విషయంలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు సంస్థ ఆరా తీసింది. హైదరాబాద్ కేంద్రీయ సదన్‌లో ఉన్న సీబీఐ కార్యాలయంలో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం ఆయనను విచారించి కీలక విషయాలు సేకరించారు. దిల్లీ సీబీఐ ఎస్‌సీ-3 విభాగం ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలోని బృందం అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది.