జగన్ తిరుమల పర్యటన… జిల్లా నేతలకి బాబు కీలక సూచనలు !

రేపు ఏపీ సీఎం జగన్ తిరుమల వెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనకు వచ్చినప్పుడు డిక్లరేషన్ విషయం లో పట్టుపట్టాలని చిత్తూరు జిల్లా పార్టీ నేతలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సీఎం తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ పై డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బాబు సూచించారు. అంతే కాదు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు సీఎం నుంచి డిక్లరేషన్ కోరుతూ లేఖలు రాయలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

రేపు షెడ్యూల్ ప్రకారం రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 3.50 గంటలకు జగన్‌ చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తిరుమలలోని పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. అనంతఃరం 6.20 నిమిషాలకు గరుడ వాహనం సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 24న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత 8.10 నిమిషాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యూరప్పతో కలిసి కర్ణాటక సత్రాల నూతన భవన నిర్మాణ భూమి పూజలో జగన్ పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం గం.11.30కు తిరుమల నుండి తిరుగు ప్రయాణం అవుతారు.