విశాఖ ఉక్కుకు భూములపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సేకరించిన భూములను ఆ కర్మాగారానికి బదలీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఉక్కు శాఖ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూములను ఆ ప్లాంట్‌కు బదలాయించడం ద్వారా దాని ఆస్తుల విలువను, రుణ శక్తిని పెంపొందించడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు నిరాకరించడానికి కారణాలు ఏమిటి…అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
దీనికి మంత్రి వివరణ ఇస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించి అప్పగించింది. తదనంతరం ఆ భూములపై సర్వహక్కులను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు బదలాయించడం జరిగింది. స్టీల్ ప్రాజెక్ట్ కోసం ఆ భూములను వినియోగించుకోవడానికి వీలుగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌కు పవర్ ఆఫ్ అటార్నీ జారీ చేసింది.