పోలవరం విషయంలో ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడు అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సలహా మండలి ఆమోదించిన రూ. 55,548.87 కోట్ల రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్-2 పెట్టుబడుల అనుమతి ఇప్పటికీ పెండింగ్‌లో ఉందా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇస్తూ ఏపీ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్, ఫ్లడ్‌కంట్రోల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వయిజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సెకండ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ (ఆర్‌సీఈ-2)కి 2017-18 ధరల ప్రకారం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలిపిందని.. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆ వ్యయాన్ని 2017-18 ధరలను అనుసరించి రూ. 47,725.74 కోట్లకు పరిమితం చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 డిసెంబరులో ఆర్‌సీఈ-2కి పెట్టుబడుల అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదనలు సమర్పించిందని.. దానిపై అథారిటీ ఏపీ ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం/సమ్మతి కోరిందని చెప్పారు. పదేపదే గుర్తుచేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అవసరమైన దస్తావేజులు/సమ్మతిని అందించలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.