రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నాం. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురం లలో వీటిని పరిశీలిస్తున్నాం. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తాం.
మొట్టమొదటి సీ ప్లేన్ డెమో ను అక్టోబర్ లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తాం. గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు ఇబ్బంది కారణంగా కార్యరూపం దాల్చలేదు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నాం. విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసర సమస్యకు పరిష్కారం గా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన. ఉన్న విమానాశ్రయాల సామర్ధ్యం పెంచుతున్నాం. విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదం పై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. నివేదిక అందిన తర్వాతే దానిపై మాట్లాడతా అని పేర్కొన రామ్మోహన్ నాయుడు.. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉంది అని తెలిపారు.