స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాలు కోరారు. జైలులో ఉంచి తనను క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు జడ్జికి చెప్పారు. తనకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారని.. అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని వాపోయారు. తనపై ఉన్నవి ఆరోపణలేనని.. ఇంకా నిర్ధారణ కాలేదని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టాన్ని గౌరవిస్తానని తెలిపారు. హక్కులను, రాజ్యాంగ విలువలను పరిరక్షించాలని పేర్కొన్నారు.
దీనికి జడ్జి స్పందిస్తూ.. “మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మీరు దీన్ని శిక్షగా భావించవద్దు. మీపై వచ్చిన ఆరోపణలు మాత్రమే.. నేర నిరూపణ కాలేదు. చట్టం, నిబంధనల ప్రకారమే మీకు రిమాండ్ విధించాం. జైలులో సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా. సౌకర్యాలు అవసరమైతే దానికి అనుగుణంగా ఆదేశాలిస్తాం మీరు 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది. మీ తరఫు న్యాయవాదులు కస్టడీ అవసరం లేదని వాదించారు.” అని చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడారు.