ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు

-

ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్థులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ.. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని అన్నారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.

సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ చెప్పారని.. ఆయన స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలపై శ్రద్ధ పెడతామన్న ఆయన.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అని.. దివ్యాంగులకు పింఛను రూ.6వేలు చేశామని.. వారికి చేయూతనివ్వడం సమాజం బాధ్యత అని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయాల్సి ఉందని అన్నారు..

‘అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు ఐదు సంతకాలు పెట్టా. మొదటిది మెగా డీఎస్సీ.. వీలైనంత త్వరగా టీచర్ల నియామకం చేపట్టే బాధ్యత తీసుకుంటా. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం చేశా. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మూడోది పెట్టా. రూ.5 కే భోజనం చేయొచ్చు. త్వరలోనే 183 క్యాంటీన్లను ప్రారంభిస్తాం. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్య శిక్షణ ఇస్తాం.’ అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news