హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఎన్‌హెచ్‌ఏఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఆదివారం (జులై 1) అర్ధరాత్రి నుంచి టోల్ వసూళ్లు ప్రారంభమయ్యాయి. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వరుసలుగా ఉన్న జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా నిర్మించేందుకు రూ.1740 కోట్లకు జీఎమ్మార్ టెండర్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. 2012 డిసెంబరు నుంచి టోల్ వసూళ్ల బాధ్యతతో పాటు హైవే పర్యవేక్షణను కూడా జీఎమ్మార్ చూసేది.
తెలుగు రాష్ట్రాల విభజనతో ఇసుక లారీలు, రవాణా వాహనాలు తగ్గి రోజుకు రూ.20 లక్షల మేర.. నెలకు రూ.6 కోట్ల వరకు నష్టం వస్తుందని జీఎమ్మార్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ ఆ నష్టాన్ని రెండు విడతల్లో భర్తీ చేసేందుకు ఈ ఏడాది జూన్ నెలలో జీఎమ్మార్‌తో ఒప్పందం చేసుకోగా.. 2025 జూన్ వరకు జీఎమ్మార్ సంస్థకు టోల్ వసూళ్ల అవకాశం ఉంది. అయితే ఎన్‌హెచ్‌ఏఐతో ఒప్పందం మేరకు ఏడాది ముందే ఈ బాధ్యతల నుంచి తప్పుకొంది.