- వైకాపా ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
అమరావతిః ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు కనువిప్పు కావాలని తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో స్థానికి ఎన్నికల నిర్వహణ, అత్యున్నత న్యాయస్థానం తీర్పు, రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు సంబంధించి చంద్రబాబు తాజాగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ అరాచక పాలనకు అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఓ కనువిప్పు కావాలని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య నాలుగు మూల స్థంభాలను జగన్ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా సజావుగా పనిచేయడం లేదని విమర్శించారు. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకుని న్యాయం చేయడం హర్షణీయమన్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని చంద్రబాబు కోరారు.