బాబు వస్తున్నాడో… చినబాబు వస్తున్నాడో అంటూ తెలుగు తమ్ము ళ్లు అంతా కలిసి పాట పాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. సరికొత్త నాయకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు లోకేష్ సర్వం సిద్ధం చేసుకున్నారట. దీని కోసం సమయాన్ని పూర్తిగా లోకేష్ సద్వినియోగం చేసుకుని అన్ని రకాలుగా సిద్దమే తమ రాజకీయ ప్రత్యర్థులతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే టిడిపి లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారి అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు తరువాత చిన బాబు పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సి ఉంది. టిడిపి రాజకీయ ప్రత్యర్థులు లోకేష్ ను అసమర్ధ నాయకుడిగా ముద్రవేసి ప్రచారం చేశారు. దీనికి తగ్గట్టుగానే లోకేష్ ప్రసంగాలు కానీ, పనితీరు కానీ ఉంటూ వస్తుండడంతో, సొంత పార్టీ నాయకుల్లోనే లోకేష్ పనితీరు పై అనేక అనుమానాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలో తాను అసమర్ధుని కాదని, సమర్థుడైన నాయకుడుని అని నిరూపించుకునేందుకు లోకేష్ తీవ్రంగానే కష్టపడ్డారట. దీనికోసం తన పర్సనాలిటీని తగ్గించుకోవడంతో పాటు, ప్రసంగాల్లో పదును, తడబాటు లేకుండా మాట్లాడడం, ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడం ఇలా అన్ని విషయాల్లోనూ బాగా ఆరితేరారు. దీనికి తోడు పార్టీలో సీనియర్ నాయకులంతా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉండడం, నాయకుల వారసులు ఇప్పుడు యాక్టివ్ గా ఉండడంతో, వారిని ఆకర్షించి వారి బలం ఉపయోగించుకుని, పార్టీని పరుగులు పెట్టించాలని, యువ నాయకులతో ప్రత్యేకంగా ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుని, జగన్ కు దీటుగా సవాల్ విసరాలని లోకేష్ ఏపీలో అడుగుపెట్టబోతున్నాడట.
అలాగే ప్రజల్లోనూ బలం పెంచుకునేందుకు చంద్రబాబు కొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. కానీ ఇప్పటి వరకు తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ ఇప్పుడు అతి తొందరలోనే లోకేష్ ఏపీలో అడుగు పెట్టడంతో పాటు, అక్టోబర్ రెండో తేదీ నుంచి ఏపీలో సైకిల్ యాత్ర చేపట్టాలని చూస్తున్నారట. ఈ మేరకు రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అన్ని వ్యవహారాలను టీడీపీ అధినేత చంద్రబాబు చక్కబెడుతూ వస్తున్నారు. ఇకపై అన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో లోకేష్ ప్రాధాన్యం పెరిగేలా ప్లాన్ చేశారట.
తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవహారాలను కేటీఆర్ చక్కబెట్టి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ సమర్ధవంతం అయిన నాయకుడిగా గుర్తింపు పొందడంతో పాటు, కాబోయే సీఎం గా ఆయన పిలిపించుకుంటున్నారు. అదే స్థాయిలో తాను కూడా బలపడాలి అనే అభిప్రాయంతో లోకేష్ ఇప్పుడు ‘సైకిల్’ ను పరుగులు పెట్టించాలని ఉత్సాహంగా ఉన్నారట.
-Surya