ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది.
శ్వేత పత్రం విడుదల చేసిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయని.. గతంలో పింఛన్లు కూడా రావనే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. అవి తక్కువగా ఉండటం వల్ల ఆదాయం కూడా తక్కువగా ఉండేదని చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చిందని.. 52 శాతం జనాభా ఉన్న ఏపీకి 46 శాతం ఆదాయం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.