రాష్ట్రప్రతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 2019 లో వైఎస్ జగన్ సిఎం అయిన తరవాత రాష్ట్రంలో జరుగుతున్న హింస, నిరంకుశ పాలన, అరాచకాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థల విధ్వంసం, న్యాయ వ్యవస్థ,కేంద్ర సంస్థలపై దాడులు వివరిస్తూ లేఖ రాశారు చంద్రబాబు.
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను వివరిస్తూ 9 పేజీల లేఖ విడుదల చేశారు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలు 2019 నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ప్రతిపక్ష నేతగా నేను ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు బాబు.లెజిస్లేచర్, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలను భయపెట్టడం అని జగన్ పై ఫైర్ అయ్యారు.
2019 మేలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ‘విధ్వంసక పాలన’ను ఆవిష్కరించారని.. ప్రజా ఆస్తి అయిన ‘ప్రజా వేదిక’ని కూల్చివేసి తన అసంబద్ధమైన మనస్తత్వాన్ని తెలియజేశాడని చురకలు అంటించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని వినాశకర నిర్ణయాలతో నాశనం చేశాడని.. జగన్ నిర్ణయాల కారణంగా రాష్ట్రం ఏర్పడి దశాబ్దం రావస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వారి సొంత రాజధాని నగరం లేదని మండిపడ్డారు.