వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద పోలీసులకు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం..!

విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య ఇవాళ వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీకి వీసీకి మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన ఏసీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్టీ నాయకులను యూనివర్సిటీ ఆవరణలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ.. మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన తమపై పోలీసులు ఆంక్షలు విధించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బస్సులో పడేశారు. జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు ఇది నిదర్శనమన్నారు. బ్రిటిష్ వారిపై స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నిర్బంధాలు కొత్త ఏమీ కాదని రుద్రరాజు తెలిపారు. రెచ్చగొట్టడం మానుకోవాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఆందోళన తరువాత కాంగ్రెస్ నాయకులు వీసీకి వినతిపత్రం సమర్పించారు.