ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? : పయ్యావుల

-

చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా విజయవాడలోని ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. అయితే.. టీడీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారంలో స్పందించారు. ఎవరికీ కనిపించని అవినీతి జగన్ కే ఎందుకు కనిపిస్తోందని విమర్శించారు. స్కిల్ కేసులో డబ్బు ఎక్కడికీ వెళ్లినట్టు నిరూపణ కాలేదని అన్నారు. రివర్స్ టెండరింగ్ లాగా ఇది రివర్స్ ఇన్వెస్టిగేషన్ అని వ్యంగ్యం ప్రదర్శించారు.

Payyavula demands for an in-depth study on the financial situation of AP

 

అవినీతికి పాల్పడబోమని సంతకం చేస్తేనే ఒప్పందాలు జరుగుతాయని, నిధుల విడుదలలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు. అధికారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నిధుల విడుదలలో ప్రేమ్ చంద్రారెడ్డి జాగ్రత్తగా వ్యవహరించారని, ఐదు విడతలుగా నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.

1997 తర్వాత దేశంలో సీమెన్స్ కార్యకలాపాలు బాగా విస్తరించాయని పయ్యావుల తెలిపారు. స్కిల్ ప్రాజెక్టు కోసం నలుగురు అధికారుల బృందం గుజరాత్ వెళ్లి పరిశీలించి రిపోర్టు ఇచ్చిందని పయ్యావుల వెల్లడించారు. 40 సెంటర్ల ద్వారా యువతకు శిక్షణ ఇచ్చామని, ఎక్కువమంది విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం తప్పా? అని ప్రశ్నించారు.

సీమెన్స్ టెక్నాలజీ ద్వారా అనేక లాభాలు కలిగాయని పయ్యావుల వివరించారు. సీమెన్స్ ఇచ్చే నైపుణ్య శిక్షణను అబ్దుల్ కలాం కూడా ప్రశంసించారని వెల్లడించారు. 17ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని పయ్యావుల ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news