మహిళలపై నేరాలు చేసేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మహిళలపై జరిగే నేరాల విషయంలో నిందితులకు ఖచ్చితంగా, వేగంగా శిక్ష పడేలా దర్యాప్తు సాగాలని సిఎం ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్ష తప్పదనే భయం నేరగాళ్లలో రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా, చిలమత్తూరు మండలం, నల్లబొమ్మనిపల్లిలో అత్తాకోడళ్లపై సమూహిక అత్యాచార ఘటనలో జరుగుతున్న విచారణపై సమీక్షించారు. ఈ ఘటనలో నిందితులకు తక్షణం శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి కేసును విచారించాలని అన్నారు. దీని కోసం హైకోర్టుకు విన్నవించి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి, మహిళలకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.