మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వుతుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలో భానుడు భగభగమంటుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. ఇక ఈసారి గత వేసవి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వేసవిలో ఎదురయ్యే నీటి ఎద్దటి, వడగాలులు, ఎండల ప్రభావం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలతో చర్చించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు.. అక్కడ తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. హీట్ వేవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాలని సూచించారు. వేసవిలో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు.