ఓవైపు మండుతున్న ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు భాగ్యనగరంలో మాత్రం చల్లని గాలులు వీస్తున్నాయి. నగరంలో ఇవాళ పలుచోట్ల వర్షం పడుతుోంది. నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక భాగ్యనగర పరిధిలోని బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లీహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. భారీ వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది.
గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 దాటితే ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. అయితే ఉక్కపోతతో విలవిల్లాడుతున్న భాగ్యనగర వాసులు.. వర్షం కురవడంతో కాస్త ఉపశమం పొందుతున్నారు. అయితే అకాల వర్షాలు మాత్రం పలు జిల్లాల్లో రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా అకాల వర్షాలతో నీటిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.