క్రీడా వికాసకేంద్రాలకు 23 కోట్లు మంజూరు చేసిన ఏపీ సీఎం..!

-

మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చామని… నాడు పలు స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపడితే… గత వైసీపీ ప్రభుత్వం అన్ని పనులు నిలిపివేసిద‌ని చంద్రబాబు నాయుడు అన్నారు.

నాడు ప్రారంభమై కొంతమేర పూర్తి అయిన స్టేడియాలు, క్రీడా ప్రాంగణాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాసకేంద్రాల పూర్తికి రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను క్రీడలు, వ్యాయామం వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని.. క్రీడలు అంటే కేవలం పోటీల్లో పాల్గొనే వాళ్లకు సంబంధించిన‌ విషయంగానే చూడవద్దని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వాళ్లు కూడా క్రీడల్లో భాగస్వాములు అయ్యేలా చేయాలన్నారు. గతంలో గ్రామాల్లో కబడ్డీ, వాలీబాల్ వంటి ఆటలు ఆడేవారని.. ఇప్పుడు టీవీలు, ఇతర మాధ్యమాల కారణంగా ఆ సంస్కృతి పోయిందని సీఎం అన్నారు. మళ్లీ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తే.. ప్రజలు ఆటల వైపు మొగ్గుచూపుతారని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news