గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే.. సీఎం చంద్రబాబు 24 గంటల్లో రూ.49 కోట్లు మంజూరు చేశారని ఏపీ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో పర్యటించిన పవన్.. ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది.. నీడనిస్తుందని అన్నారు.
అద్భుతమైన అరకు ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని.. గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు రూ.92 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.1,500 కోట్ల విలువైన పనులను మంజూరు చేసి టెండర్లు పిలిచిందని వివరించారు.