ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారన్న ఆరోపణలపై విచారణకు సంబంధించిన కేసుల్లో సీఎం జగన్ కి హైకోర్టులో ఊరట లభించింది. సిబిఐ కోర్టులో రోజువారి విచారణకు ఆయన వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లి లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసుల విచారణ ఇకపై రోజువారిగా జరగనుంది.
అయితే ఈ విచారణకు అన్ని కేసుల్లో ప్రధమ నిందితుడిగా ఉన్న జగన్ తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని సిబిఐ కోర్టు పేర్కొంది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కావాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.
తన బదులుగా తన న్యాయవాది విచారణకు హాజరవుతారని, అందుకు అంగీకరించాలని తన పిటీషన్ లో జగన్ అభ్యర్థించారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. సిబిఐ కోర్టు విచారణలకు జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. సీఎం జగన్ కు బదులుగా ఆయన తరపు న్యాయవాది విచారణకు అనుమతించాలని సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.