నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా లక్క సాగరంలో 77 చెరువులకు నీరందించే హంద్రీ నీవా ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు ఏపీ సీఎం జగన్. అనంతరం డోన్ లో బహిరంగసభలో పాల్గొననున్న సీఎం జగన్.. మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసే ఛాన్స్ ఉంది.
ఇక సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన నేపథ్యంలో సిపిఐ నేతల ముందస్తు అరెస్టు జరుగుతోంది. సిపిఐ నేతల ముందస్తు అరెస్టును ఖండించిన సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ… జగన్ సర్కార్ పై సీరియస్ అయ్యారు.
సిపిఐ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు ముందస్తు అరెస్టులు అయ్యారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం గర్హనీయం అని ఫైర్ అయ్యారు సీపీఐ రామకృష్ణ. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోంది..తక్షణమే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు సీపీఐ రామకృష్ణ