పద్మ అవార్డు గ్రహీతలకు సీఎం జగన్, రేవంత్ అభినందనలు చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఇద్దరు కళాకారులు పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. పలు రంగాల్లో విశేష సేవలను అందించిన వారికి ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది.
నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగాం కు చెందిన గడ్డం సమ్మయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. 63 ఏళ్ల వయస్సున్న కొండప్ప బుర్ర వీణ వాయిద్యకారుడు. తెలుగు, కన్నడ తత్వాలు పాడుతూ బుర్ర వీణను వాయించటంలో సంగీత నిపుణునిగా స్థానికంగా అందరి గుర్తింపును అందుకున్నారు. గడ్డం సమ్మయ్య యక్షగాన కళాకారుడు. 67 ఏళ్ల వయస్సున్న సమ్మయ్య అయిదు దశాబ్దాలుగా ఇదే రంగంలో తన ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. దాదాపు 19 వేల ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్ష కళాకారుల సంఘం తో పాటు గడ్డం సమయ్య యువ కళా క్షేత్రం ద్వారా ఈ కళను ఇతరులకు నేర్పించాడు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతీ కళలను దేశమంతటికి చాటిచెప్పారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అవార్డు గ్రహితలకు అభినందనలు తెలిపారు. అటు సీఎం జగన్ కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.